పొదస్తమానం గేమ్స్‌లో మునిగిపోతారు పిల్లలు, కుర్రాళ్లు. అయితే గేమ్‌తో కూడా కోట్లు సంపాదించవచ్చు అని చేసి చూపించాడు ఓ కుర్రాడు. వివరాల్లోకి వెళితే… కైల్ గీర్స్‌డార్ఫ్ 16 ఏండ్ల కుర్రాడు. ఈ అమెరికా అబ్బాయి పాఠశాల స్థాయి విద్యార్థే. ఈ వయసుకే అతను 3 మిలియన్ డాలర్ల (రూపాయల్లో 20.5 కోట్లు) ప్రైజ్‌మనీ అందుకున్నాడు. ఫోర్ట్‌నైట్ అనే ఆటలో అతను కొన్ని రోజుల కిందటే ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఏకంగా 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.205 కోట్లు) ప్రైజ్‌మనీతో నిర్వహించిన టోర్నమెంట్ అది. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషె ఏరెనా స్టేడియంలో 23 వేలమంది వీక్షకుల సమక్షంలో.. ప్రపంచవ్యాప్తంగా టీవీలు, ఇంటర్నెట్ ద్వారా కోట్లాదిమంది ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఊగిపోతుండగా ఈ టోర్నీ ఉత్కంఠభరితంగా సాగిపోయింది.
అయితే టోర్నమెంట్ అని, స్టేడియం అని అంటున్నాం కాబట్టి.. ఇది మైదానంలోకి దిగి అమీతుమీ తేల్చుకునే ఆట అనుకుంటే పొరపాటే. స్టేడియంలో కంప్యూటర్ తెరల ముందు కూర్చుని.. చెవులకు హెడ్‌ఫోన్స్, చేతుల్లో ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం పట్టుకుని ఆడే మైండ్ గేమ్ ఈ ఫోర్ట్‌నైట్. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది రేసులో నిలిస్తే.. చివరికి 30 దేశాల నుంచి వందమందికి ప్రపంచకప్‌లో పోటీ పడే అవకాశం లభించింది. ఆరు గేమ్‌ల ప్రపంచకప్ ఫైనల్స్‌లో సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లు జరిగాయి. సింగిల్స్‌లో గీర్స్‌డార్ఫ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీప ప్రత్యర్థి 33 పాయింట్ల దగ్గర ఆగిపోతే.. ఈ కుర్రాడు 59 పాయింట్లతో తిరుగులేని ఆధిక్యం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయాడు.
ఏమిటీ గేమ్ ?
ఫోర్ట్‌నైట్ గేమ్‌లో ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి. ఈ గేమ్‌లో భాగంగా ఆటగాడు ఒక ద్వీపంలో వెళ్లి పడతాడు. అక్కడ తాను బతకడం కోసం వనరులు వెతుక్కోవాల్సి ఉంటుంది. శత్రువులపై దాడికి ఆయుధాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తనను తాను కాపాడుకుంటూ ప్రత్యర్థుల అడ్డు తొలగిస్తూ వెళ్లాలి. మానసిక దృఢత్వానికి, చురుకుదనానికి అడుగడుగునా పరీక్ష పెడుతూ సాగుతుందీ గేమ్.