జనాలకు మాయమాటలు చెప్పి వారి డబ్బులను కాజేసే కేటుగాళ్లు సమాజంలో ఎక్కువైపోయారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో వారు జనాల డబ్బును దోచుకుంటున్నారు. తాజాగా ఓ 17 ఏళ్ల యువకుడు 86 ఏళ్ల వృద్ధుడికి ఇన్సూరెన్స్ ఏజెంటునని, సహాయం చేస్తానని చెప్పి ఏకంగా ఆ వృద్ధుడి అకౌంట్ నుంచి రూ.6 కోట్లు కొట్టేశాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఇన్సూరెన్స్ ఏజెంట్‌నని ఓ వృద్దుడికి చెప్పి అతన్ని నమ్మించాడు. ఆ వృద్ధుడు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకునేందుకు యత్నిస్తుండగా అతనికి సహాయం చేస్తానని ఆ యువకుడు నమ్మించాడు. అనంతరం ఆ వృద్ధుడికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలను తీసుకున్నాడు. వాటిల్లో ఉన్న రూ.6 కోట్లను తన అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అయితే విషయం గ్రహించిన ఆ వృద్దుడు తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాజాగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే నిజానికి ఆ యువకుడు ఒక్కడే కాదు.. అతనికి ఓ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే.. వారందరూ కలిసి ఢిల్లీలో నకిలీ పత్రాలతో ఓ ఇన్సూరెన్స్ కంపెనీనే పెట్టారు. అలాగే కాల్ సెంటర్లను ఓపెన్ చేసి ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల కోసం పనిచేసేవారు. వాటికి చెందిన ఇన్సూర్సెన్స్ పాలసీలను ప్రమోట్ చేసేవారు. అదే సమయంలో జనాల వివరాలను సేకరించి వారి వద్దకు వెళ్లి అలా పైన తెలిపిన విధంగా మోసాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ సభ్యులు ఇంకా ఎందరిని ఇలా మోసం చేశారో పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా వీరు తమ కంపెనీకి గాను ఫేక్ డాక్యుమెంట్లతో ఏకంగా 35 బ్యాంక్ అకౌంట్లను కూడా ఓపెన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టారు.