తమిళనాడు ట్యుటికోరిన్ పోర్టులో పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. 2వేల కోట్ల విలువ చేసే 300 కేజీల పైగా కొకైన్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పనామా నుంచి ఆంట్వెర్ప్, కొలంబో మీదుగా ట్యుటికోరిన్ పోర్టు కు చేరుకున్న ఓ కంటైనర్ లో పెద్ద మొత్తంలో కొకైన్ దిగుమతి అయింది అనే సమాచారం మేరకు దాడులు నిర్వహించిన డీఆర్ఐ అధికారులకి పెద్ద ఎత్తున కొకైన్ దొరికింది.
కేటుగాళ్లు కలప ముసుగులో కోకైన్ స్మగ్లింగ్ కు తెర లేచినట్టు గుర్తించారు. కంటైనర్ లో ఉన్న కలప మధ్యలో దాచిన 9 సంచులను అధికారుల బృందం స్వాధీనం చేసుకున్నారు. సంచులలో తెల్లటి పౌడర్ తో వున్న కోకైన్ గుర్తించారు. కంటైనర్ తో పాటు 303 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు వాటి విలువ 2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో కోకైన్ ను ఎవరు దిగుమతి చేసారని సమాచారం సేకరిస్తున్న అధికారులు వీటి వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అనే కోణంలో కేసు నమోదు చేసి డీఆర్ఐ టీమ్ దర్యాప్తు చేస్తోంది.