జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలోని చేవా ఉల్లార్ గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. గురువారం సాయంత్రం మొదలైన ఈ ఎన్ కౌంటర్ శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. ముఖ్యంగా గురువారం రాత్రి టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు జరిగాయని తెలిసింది. చేవా ఉల్లార్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు జమ్మూకాశ్మీర్ పోలీసులు సైనిక జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు.
సైనికులు గాలింపు కొనసాగిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఈ నెలలో సౌత్ కశ్మీర్ రీజియన్‌లో జరిగిన 12వ ఎన్ కౌంటర్ ఇది కావడం గమనార్హం. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురుకాల్పుల్లో మొత్తం 33 మంది టెర్రరిస్టులు మృతి చెందారు.