కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో నిత్యం వస్తున్న పుకారు వార్తలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కొందరు కావాలని పనిగట్టుకుని మరీ వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. పనికిమాలిన వార్తలను, పుకార్లను ప్రచారం చేస్తున్నారు. ఫేక్ వార్తలతో జనాల్లో కరోనా పట్ల మరింత భయాందోళనలను పెంచుతున్నారు. ఇక తాజాగా మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాగా ఎక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేస్తే కరోనా రాదని.. అధిక ఉష్ణోగ్రత ఉన్న నీటితో స్నానం చేయాలని.. పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడైంది. ఎలా అంటే.. మనం ఏ ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేసిన సరే కరోనా వైరస్ చావదు. అలా చనిపోయేది అయితే ఎండాకాలంలోనే ఆ వైరస్ అంతం అయి ఉండేది. ఇక మరో పాయింట్ ఏమిటంటే.. మనం ఏ ఉష్ణోగ్రత ఉన్న నీటితో స్నానం చేసినా మన శరీరం కొంత సేపటికి తన ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకుంటుంది. సాధారణ స్థాయికి ఉష్ణోగ్రతను తీసుకువస్తుంది. అందువల్ల కరోనాకు, నీటి ఉష్ణోగ్రతకు, స్నానానికి సంబంధం లేదు. కాకపోతే బయట తిరిగి వచ్చిన వారు సేఫ్ సైడ్‌గా స్నానం చేసి ఇంట్లో అందరితో కలిస్తే కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా చూసుకోవచ్చు. కానీ కరోనాను మాత్రం అంతం చేయలేరు.
కనుక సోషల్ మీడియాలో ఇలాంటి పుకారు వార్తలను నమ్మకండి. ఒకటి రెండు సార్లు అవి నిజమేనా, కాదా అని నిర్దారించుకున్నాకే వాటిని నమ్మండి. లేదంటే ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారవుతారు.