రైల్వే స్టేషన్లలో చిన్నారులతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు అలాంటి చోట్ల తప్పిపోయేందుకు అవకాశం ఉంటుంది. లేదా వారికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కనుక అలాంటి ప్రదేశాల్లో చిన్నారుల పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉండరాదు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులు అక్కడ ఉన్నారో, లేదో తెలియదు కానీ.. అతను ఓ ఘోర ప్రమాదం బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లాబ్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో 2 ఏళ్ల చిన్నారి తన 14 ఏళ్ల సోదరుడితో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే వారు ఆ సమయంలో రైలు పట్టాల మీద ఉన్నారు. ఈ క్రమంలో ఆ చిన్నారిని వదిలిపెట్టి అతని సోదరుడు పక్కకు వెళ్లాడు. సరిగ్గా అదే టైముకు ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లే రైలు వచ్చింది. ట్రైన్ కింద చక్రాల మధ్యలో ఆ చిన్నారి ఇరుక్కున్నాడు. దాన్ని గమనించిన లోకో పైలట్ దీవాన్ సింగ్, అతని అసిస్టెంట్ అతుల్ ఆనంద్‌లు వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపారు.
అనంతరం రైలు చక్రాల మధ్య చిక్కుకున్న ఆ బాలున్ని వారు రక్షించారు. అప్పటికే బాగా ఏడుస్తున్న ఆ బాలున్ని సముదాయించి నెమ్మదిగా అతన్ని చక్రాల నుంచి బయటకు తీశారు. కాగా ఆ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులు ఆ బాలురు ఇద్దరినీ వారి తల్లికి అప్పగించారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారింది.