టెక్నాలజీ వేగంగా మార్పులు చెందుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లకు మోసాలు చేయడం మరింత సౌకర్యవంతంగా మారింది. డార్క్ వెబ్‌ను ఆధారంగా చేసుకుని హ్యాకర్లతో చేతులు కలుపుతూ కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ యువకుడు అలాగే చేశాడు. రష్యన్ హ్యాకర్లతో చేతులు కలిపి విదేశీయులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులను పెద్ద ఎత్తున హ్యాక్ చేసి ఏకంగా రూ.5 కోట్లు కాజేశాడు. వివరాల్లోకి వెళితే..
అహ్మదాబాద్‌కు చెందిన 21 ఏళ్ల హర్షవర్ధన్ పర్మర్ ఇంటర్ చదివాడు. అతని తండ్రి దినసరి కూలీ. తల్లి స్థానిక మున్సిపల్ హాస్పిటల్‌లో ఆయాగా పనిచేస్తోంది. అయితే అతను డార్క్ వెబ్ ద్వారా ప్రజలను మోసం చేసి డబ్బులు దోచుకోవచ్చని తెలుసుకున్నాడు. దీంతో వెంటనే అందులో కొందరు రష్యన్ హ్యాకర్లను పరిచయం చేసుకున్నాడు. వారికి డబ్బులు చెల్లిస్తూ విదేశీయులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను సేకరించాడు. ఒక్కో వ్యక్తి కార్డుల వివరాలు చెబితే ఒక అకౌంట్‌కు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అలా అతను హ్యాకర్లకు డబ్బులు చెల్లిస్తూ వారి నుంచి సమాచారాన్ని తీసుకుని దాంతో విదేశీయుల కార్డులను వాడాడు. వాటికి ఓటీపీలు రావు కనుక యథేచ్ఛగా వాటిని ఆన్‌లైన్ లో వాడాడు.
విదేశీయుల కార్డులతో అతను పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేస్తాడు. తరువాత వాటిని అమ్ముకుని క్యాష్ చేసుకుంటాడు. ఇలా అతను కేవలం 100 రోజుల్లోనే 25వేల మంది విదేశీయులకు చెందిన కార్డులను వాడి ఏకంగా రూ.5 కోట్లు కొల్లగొట్టాడు.
అయితే ఫిర్యాదులు అందుకున్న స్థానిక సైబర్ పోలీసులు ట్రాప్ ఏర్పాటు చేసి పర్మర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతను ఒకేసారి 30 ఫ్రిజ్‌లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు వలపన్ని అతన్ని అరెస్టు చేశారు.