ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అభాసుపాలవుతోంది. విపక్షాల విమర్శలు, తల్లితండ్రుల ఆందోళనతో అప్రమత్తమైన సర్కార్ వరుసగా ఇందుకు బాధ్యులైన టీచర్లను అరెస్టులు చేస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదు చేస్తోంది. దీంతో విద్యాశాఖతో పాటు విద్యార్ధులు, ఉపాధ్యాయుల్లోనూ తీవ్ర కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో 22 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేశారు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె జడ్పి స్కూల్ లో తెలుగు పరీక్ష మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడిన 22 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాకుండా ప్రశ్నపత్రాన్ని సెల్ ఫోన్ లో బయటకు పంపిన ఇద్దరు సిఆర్పిలు, 10 మంది ఉపాధ్యాయులు, 9 మంది ఇన్విజిలేటర్ల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే.. తొలిరోజు ప్రశ్నాపత్రం లీకయితే అది మాస్ కాపీయింగ్ మాత్రమేనని చెప్పుకున్న ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపించింది. కానీ రెండోరోజు ప్రశ్నాపత్రం కూడా లీకైంది. చివరికి మూడు, నాలుగు రోజుల ప్రశ్నాపత్రాలు కూడా లీకులు కావడం, మాస్ కాపీయింగ్ జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.