ప్రపంచ వ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇందుకు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నాంది పలుకుతున్న వాతావరణం కనిపిస్తోంది. రెండు నెలల క్రితం ప్రారంభం అయిన రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ ముగియకపోగా… రోజు రోజుకు తీవ్రం అవుతోంది. రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆర్థిక ఆంక్షలు విధించినా.. తగ్గేది లేదు అన్నట్లుగా రష్యా చెలరేగుతోంది. పైగా తమకు ఎలాంటి హానీ తలపెట్టాలని నాటో చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ గతంలో వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఈ పరిణామాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం రానుందన్న సంకేతాలు రష్యా నుంచి వెలువడుతున్న సమయంలో అమెరికా తమ అత్యున్నత యుద్ధ విమానం ఎఫ్ -35లను యూరప్ కు పంపింది. వెర్మాండ్ వైమానిక స్థావరం నుంచి 8 ఎఫ్ -35 విమానాలు జర్మనీకి చేరుకున్నాయి. ఎఫ్-35 యుద్ధ విమానాలను ప్రపంచంలోనే అత్యంత ఆధునాతన, ఖరీదైన యుద్ధ విమానాలుగా పరిగణిస్తారు. రష్యా సరిహద్దు నుంచి నాటో దేశాల గగనతలాన్ని ఇవి కాపలా కాయనున్నాయి. విదేశాల్లో ఎఫ్ -35 లను మోహరించడం ఇదే మొదటిసారి.