మనదేశం లో తొలసారిగా కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన రాష్ట్రం కేరళ. తొలి కేసు నమోదు అయిన నాటి నుంచి కూడా ఆ రాష్ట్రంలో ఒక్కొక్కటిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకూ కేరళ లో నమోదైన కేసుల సంఖ్య 96. కేవలం సోమవారం ఒక్కరోజులోనే 28 కరోనా పాజిటివ్ లు నమోదు అయ్యాయి. ఇప్పటికి కరోనా బాధితులు 5 మంది కోలుకోగా 91 కేసులు రాష్ట్రంలో ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.
సోమవారం ఒక్క కాసర్‌గడ్ జిల్లాలోనే 19 కేసులు నమోదయ్యాయి అని, కన్నూరులో 5, ఎర్నాకుళంలో 2, త్రిస్సూర్‌లో 1, పతానంతిట్టలో 1 గా కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. వారందరూ చికిత్స పొందుతున్నారు అని సీఎం పినరయి విజయన్ తెలిపారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం తో కేరళ సీఎం రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటించారు. మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది.
పక్క రాష్ట్రాల సరిహద్దులను కూడా మూసివేస్తున్నామని ప్రజా రవాణాను కూడా నిలిపివేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలను మూసివేస్తామని విజయన్ తెలిపారు. ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వీలుగా దుకాణాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు తెరచి ఉంచాలని, ప్రజలు దీనికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.