ఈటలకు షాక్ : హుజురాబాద్ అభివృద్ధికి 35 కోట్లు రిలీజ్ చేసిన కెసిఆర్ సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజ‌కీయాల‌న్నీ హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక మొన్న ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఒక్క‌సారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. దీంతో ప్ర‌త్య‌క్ష రాజకీయాల‌కు అన్ని పార్టీలూ స‌న్న‌ద్ధ‌మ‌వ‌తున్నాయి. అటు ఈటల బిజేపిలో చేరడంతో.. టీఆర్ఎస్ కాస్త డిఫెన్స్ లో పడింది. ఎలాగైనా ఈటలను ఓడించాలనే ఉద్దేశంతో.. అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీఆర్ఎస్. ఇందులో భాగంగా టీఆర్ఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.

పట్టణ ప్రజల తాగునీటి కోసం 10 కోట్ల 52 లక్షలు, వార్డు అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పట్టణంలో 35 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. 45 రోజుల్లో ఈ పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని గంగుల కమలాకర్ తెలిపారు. కాగా ఈనెల 14 న ఈటల రాజేందర్ బిజేపిలో చేరిన సంగతి తెలిసిందే.