కరోనా కారణంగా గతేడాదిలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. ఇక ప్రస్తుతం కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల సైబర్ దాడులు పెరుగుతున్నాయని సెక్యూరిటీ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే చెక్ పాయింట్ మొబైల్ సెక్యూరిటీ అనే సంస్థ తాజాగా ఈ విషయంపై ఓ నివేదికను విడుదల చేసింది.
చెక్ పాయింట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2020లో సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిందని వెల్లడైంది. వాటిల్లో 93 శాతం దాడులు మొబైల్స్‌పై జరిగినవే నని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులే లక్ష్యంగా వారి కంపెనీలపై సైబర్ దాడులు పెరిగాయని తేలింది. హ్యాకర్లు అలాంటి ఉద్యోగుల మొబైల్స్‌లోకి మాల్‌వేర్‌ను చొప్పించడం ద్వారా సున్నితమైన డేటాను సేకరిస్తున్నారని వెల్లడైంది.
ఇక గతేడాది బ్యాంకింగ్ అప్లికేషన్లపై 15 శాతం దాడులు పెరిగాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి 10 ఫోన్లలో 4 ఫోన్లు సైబర్ దాడులకు అనుకూలంగా ఉన్నాయని, ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ తయారీదారు తమ చిప్‌సెట్‌లలో ఉండే లోపాలను సరిచేసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు తెలిపారు.