దేశంలో వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే ఏబీపీ- సీఓటర్ సర్వేలో మళ్లీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని కుండబద్దలు కొట్టింది. ఉత్తర్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీనే అధికారం చేజిక్కిచ్చుకుంటుందని.. పంజాబ్ లో ఆప్ ఎక్కువ సీట్లను సాధిస్తుందని అంచానా వేసింది.
యూపీలో మొత్తం 403 అసెంబ్లీ సీట్లు ఉంటే.. 2017లో బీజేపీ 325 సీట్లను సాధించింది. అయితే ఈసారి మాత్రం 217 సీట్లు మాత్రమే వస్తాయని అంచానా వేసింది. గత ఎన్నికల్లో చతికిల పడ్డ సమాజ్ వాది పార్టీకి 150 వరకు సీట్లు వస్తాయని అంచానా వేసింది. ఉత్తరాఖండ్ లో బీజేపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని అంచానా వేసింది. ఆ రాష్ట్రంలో మొత్తం 70 సీట్లు ఉంటే 38 స్థానాలు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉందని తెలిపింది. మరో కీలక రాష్ట్రం పంజాబ్ లో ఆప్ పాగా వేసేలా కనిపిస్తోంది. 117 స్థానాల్లో ఆప్ కు 51, కాంగ్రెస్ కు 31, అకాళీదల్ కు 20 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సర్వే తెలిపింది. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ 27 చోట్ల, కాంగ్రెస్ 22 చోట్ల విజయం సాధిస్తుందని సర్వే అంచానా వేసింది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో బీజేపీ 21 చోట్ల విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది.