దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఢిల్లీలో గత నాలుగు రోజులుగా రోజుకు దాదాపు 25వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా 25,462 కరోనా కేసులు నమోదు కాగా, 161 మంది చనిపోయారు. ఇప్పటికే ఢిల్లీలో వారాంతపు లాక్డౌన్ కొనసాగుతోండగా… పరిస్థితి పూర్తిగా చేజారకుండా ఉండాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. నేటి రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసారు. నిత్యావసరాలు, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. కేసుల సంఖ్య పెరగడంతో ఇప్పటికే ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచుతామని ఆక్సిజన్, మందులు సమకూర్చే ఏర్పాట్లు చేస్తామని కేజ్రీవాల్ అన్నారు.
ఇలాంటి సమయంలో సాయం చేస్తున్నందుకు కేజ్రీవాల్కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఆఫీసులు వర్క్ ఫ్రం హోం ద్వారానే నడిపేలా చర్యలు తీసుకోవాలని, వివాహ వేడుకలు కేవలం 50 మందితో మాత్రమే జరుపుకోవాలని అన్నారు. ఇక వలస కూలీలకు కూడా కేజ్రీవాల్ భరోసా కల్పించారు. ఇది ఆరురోజుల పాటు కొనసాగే చిన్న లాక్డౌన్ మాత్రమేనని దయచేసి ఢిల్లీ వదిలి వెళ్లొద్దని కోరారు. వలస కూలీలను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుంది భరోసా కల్పించారు.