ఆరు నెల‌ల జ‌గ‌న్ పాల‌న : సంక్షేమం, అభివృద్ధి పై జనం ఏమన్నారంటే..?

-

‘ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా’…. ఈ మాట జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే రోజు చెప్పినది. అయితే నేటితో జగన్ పాలన ఆరు నెలలు పూర్తి చేసుకుంది. మరి జగన్ మంచి సీఎం అనిపించుకున్నారో లేదో ఒక్కసారి చూద్దాం. ఎన్నికల్లో ఊహించని విధంగా 151 సీట్లు సాధించడంతో జగన్ పట్ల ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ ఆరు నెలల్లో జగన్ పాలన కొనసాగిందని చెప్పొచ్చు. మొదట ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం అవ్వగానే తోలిసంతకం పింఛన్ల పెంపుపై పెట్టారు. రూ.2 వేలు ఉన్న పింఛన్ 2250 వరకు పెంచారు. అలాగే ప్రతి ఏటా రూ.250 పెంచుకుంటూ పోతానని చెప్పారు. అదేవిధంగా ఆశా వర్కర్లు, హోమ్ గార్డుల జీతాలు పెంచారు.

అటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా సాగుతున్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చారు. ఇక ఎన్నో ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు ఆరు నెలల్లోనే చెక్ పెట్టారు. వాలంటీర్లు, సచివాలయాల పేరిట దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇక నిరుద్యోగులకు మేలు చేసేలా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే నిర్ణయం తీసుకున్నారు. ఇక పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యపాన నిషేధం దిశగా కీలక అడుగులు వేశారు. మద్యం షాపులని తగ్గించి, ఆ షాపులని ప్రభుత్వమే నడిపిస్తూ, బెల్ట్ షాపులకు చెక్ పెట్టారు.

ఈ ఆరు నెలల్లో జగన్ రైతులకు పెద్ద పీఠ వేశారు. వైఎస్సార్ రైతు భరోసా-పి‌ఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు రూ. 13,500 సాయం చేశారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, సున్నా వడ్డీకే రుణాలు. ఆక్వా రైతులకు కరెంట్‌ చార్జీలు యూనిట్‌కు రూ.1.50కు తగ్గింపు.  గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. రూ. 2000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయిన లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.7 లక్షల పరిహారం ఇవ్వనున్నారు. రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా వైఎస్సార్‌ ఉచిత బీమా పథకం తీసుకొచ్చారు.

ఆటో డ్రైవర్లకు, మత్స్యకారులకు జగన్ సర్కారు ఆర్థిక సాయం చేసింది. ఆరోగ్య శ్రీ పరిధి పెంచడం, కాపు మహిళకు ఏటా రూ. 15వేలు సాయం. త్వరలో అమ్మఒడి, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయనున్నారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా అవినీతిపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్ 14400ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

అయితే సంక్షేమ పథకాల పరంగా జగన్ మంచి మార్కులు కొట్టేసిన అభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడ్డారు. పూర్తిగా ఈ ఆరు నెలల్లో సంక్షేమంపై దృష్టిపెట్టడం ద్వారా అభివృద్ధి సాధ్యపడలేదు. ముఖ్యంగా ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదలైంది. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. రాష్ట్రానికి గుండెలాంటి అమరావతి, పోలవరం నిర్మాణాలు పెద్దగా జరగలేదు. అలాగే రాష్ట్రం నుంచి పలు సంస్థలు వెనక్కివెళ్లిపోయాయి. అదేవిధంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. పి‌పి‌ఏ ల పునఃసమీక్ష, రివర్స్ టెండరింగ్, పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేయడం, మంత్రుల మాటతీరు లాంటి వల్ల ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వచ్చింది.

అయితే సంక్షేమ పథకాలని దిగ్విజయంగా అమలు చేస్తున్న జగన్ ని రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి భయపెడుతుంది. అభివృద్ధి లేకపోవడం వల్ల ఆదాయం వచ్చే మార్గాలు తగ్గిపోయాయి. ఏదేమైనా సంక్షేమం-అభివృద్ధి అనేవి రాష్ట్రానికి రెండు కళ్ల లాంటివి. ఈ రెండు ఎప్పుడు ఒకే స్థాయిలో నడవాలి. అలా కాకపోతే మంచి పేరు రావడం కష్టమే. కాబట్టి సంక్షేమం-అభివృద్ధి లని జోడెడ్లలాగా పరుగులెత్తిస్తే మంచి పేరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news