కరోనాతో జనాలు ఇన్ని రోజులూ అవస్థలు పడ్డారు. బయటకు వెళ్లాలంటేనే భయపడ్డారు. కానీ ఇకపై అలా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రాబోతోంది. వ్యాక్సిన్ పంపిణీని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరు వరకు భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీకి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. వ్యాక్సిన్లకు ఆమోదం లభించడమే మిగిలి ఉంది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సహా పలు సంస్థలు ఇప్పటికే తమ తమ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగానికి దరఖాస్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో వాటికి త్వరలోనే ఆమోదం లభిస్తుందని తెలుస్తోంది. ముందుగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫైజర్, మోడెర్నాలకు చెందిన వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు డీసీజీఐ యోచిస్తోంది. అయితే ఈ రెండు వ్యాక్సిన్లకు అతి శీతల ఉష్ణోగ్రతలు (-70 డిగ్రీల సెల్సియస్) అవసరం. కానీ అందుకు తగిన సామగ్రి మన దగ్గర లేదు. అందువల్ల సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌నే వీలైనంత వరకు మొదటి దశలో జనాలకు పంపిణీ చేస్తారని సమాచారం.
ఇక రాబోయే 6 నుంచి 8 నెలల్లో 60 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయనున్నారు. అయితే 30 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున 60 కోట్ల డోసులను ఇస్తారా, లేక సింగిల్ షాట్ చొప్పున 60 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను ఇస్తారా.. అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్లకు, తరువాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, వృద్ధులకు, ఆ తరువాత సాధారణ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి. అందువల్ల సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ అయ్యేందుకు ఇంకో ఏడాది వరకు సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు వ్యాక్సిన్ వస్తుండడం జనాలకు ఊరటనిస్తోంది.