దేశంలోని 5 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న మొత్తం 8 బీచ్‌లకు ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. దేశంలో ఉన్న 8 బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించిందని తెలిపింది. గుజరాత్‌లోని శివరాజ్‌పూర్, డయ్యూ ఘోఘ్లా, కర్ణాటకలోని కసర్‌కోడ్, పదుబిద్రి, కేరళలోని కాప్పాడ్, ఏపీలోని రుషికొండ, ఒడిశాలోని పూరీ గోల్డెన్ బీచ్, అండమన్ నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్‌లకు ఈ సర్టిఫికేషన్ లభించింది.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), యూఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో), యూఎన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ), ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) సంస్థలకు చెందిన ప్రతినిధులు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చే కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక బీచ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లు అందిస్తుంటారు. బీచ్‌ల వద్దే అందే సదుపాయాలు, నీటి నాణ్యత, పరిశుభ్రత తదితర 33 అంశాల ఆధారంగా సదరు సర్టిఫికేషన్‌ను ఇస్తుంటారు.
ఇక భారత్ ఈ ఘనత సాధించడంతో ఇప్పటికే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన 50 దేశాల సరసన చేరింది. అయితే భారత్ ఈ ఘనతకు సాధించేందుకు కేవలం 2 ఏళ్లు మాత్రమే పట్టడం విశేషం. జపాన్, దక్షిణ కొరియా, యూఏఈ దేశాలకు ఇందుకు 6 ఏళ్ల సమయం పట్టింది. కాగా ప్రస్తుతం భారత్ దేశంలోని 100 బీచ్‌లకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ను సాధించేందుకు యత్నం చేస్తోంది.