బీహార్‌లో సినీ ఫక్కీలో ఓ బ్యాంకులో చోరీ జరిగింది. బైకులపై వచ్చిన 8 మంది ముఠా సభ్యులు బ్యాంకులో సిబ్బందికి గన్స్, కత్తులు చూపించి రూ.69 లక్షలు దోచుకెళ్లారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఔరంగాబాద్‌లోని జిన్నూరియాలో ఉన్న ఇండియన్ బ్యాంక్ శాఖలో ఉదయం 11 గంటలకు బైక్‌లపై 8 మంది వ్యక్తులు వచ్చారు. వారి వద్ద గన్స్‌తోపాటు అత్యంత పదునైన కత్తులు ఉన్నాయి. ఈ క్రమంలో వారు సదరు ఆయుధాలను చూపించి బ్యాంకు మేనేజర్, ఇతర సిబ్బందిని బెదిరించారు. డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామన్నారు. ఇందులో భాగంగా ఓ ఉద్యోగి ప్రతిఘటించినందుకు అతన్ని దుండగులు గాయపరిచారు.
అలా ఆ దొంగలు బ్యాంకు సిబ్బందిని బెదిరించి లాకర్‌లో ఉన్న డబ్బును బ్యాగుల్లో సర్దుకున్నారు. భిన్న రకాల విలువ కలిగిన నోట్లు మొత్తం కలిపి రూ.69 లక్షలను వారు దోచుకెళ్లారు. కాగా ఈ ఘటనపై అక్కడి ఎస్‌పీ పంకజ్ కుమార్ స్పందిస్తూ.. దొంగలు సిబ్బందికి గన్స్, కత్తులు చూపించి బెదిరించారని, వారిచేత కరెన్సీ చెస్ట్‌ను ఓపెన్ చేయించి అనంతరం అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారని తెలిపారు.
అయితే బ్యాంకులో అదే సమయానికి సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. దీంతో ఆ ముఠా సభ్యులు వెళ్లిన దారిలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఆ 8 మందిలో ఒక వ్యక్తికి సుమారుగా 50 ఏళ్లు ఉంటాయని గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. కాగా పట్టపగలు దొంగలు ఇలా అంత పెద్ద మొత్తంలో నగదు దోచేయడం అక్కడ సంచలనం సృష్టిస్తోంది.