ఏ ఎన్నికల్లోనైనా ఐదేళ్ల తర్వాత కొత్త వారు అధికారంలోకి వస్తారు. గ్రామ పంచాయతీల్లో అభిమానం, గౌరవంతో ఒకటి లేదా రెండు సార్లు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వేరే అభ్యర్థిని గెలిపిస్తారు. కుటుంబం నుంచి ఒకరో ఇద్దలో రెండు పర్యాయాలుగా పాలన కొనసాగిస్తుంటారు. కానీ.. ప్రకాశం జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 పర్యాయాలుగా ఆ కుటుంబానికి పట్టం కడుతున్నారు ఆ గ్రామ ప్రజలు. ప్రకాశం జిల్లా రెడ్డిచర్ల గ్రామంలో 1956 మొదలుకొని స్థానిక సంస్థ ఎన్నికల దాకా ప్రతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి విజయం అందిస్తున్నారు. జిల్లాలోని కొమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామంలో ఈ పరంపర కొనసాగుతోంది. పార్టీలు వేరైనా గెలుపు మాత్రం రెడ్డిచర్ల కుటుంబానిదే.
మొట్టమొదటిగా 1956లో రెడ్డిచర్ల బాలంవీరం రాజు సర్పంచ్‌గా గెలుపొందారు. ఆయన తర్వాత కొడుకు లక్ష్మినరసరాజు గెలిచారు. అనంతరం వరసగా 5 పర్యాయాలుగా అదే కుటుంబానికి చెందిన రెడ్డిచర్ల వెంకటేశ్వర రాజుకు పట్టం కట్టారు. 1970–76 వరకు వెంకటేశ్వర రాజు సర్పంచ్‌గా ఉన్నారు. మళ్లీ 1983–87 వరకు అతనే ఏకగ్రీవంగా సర్పంచ్ పీఠం దక్కించుకున్నారు.
ఆ తర్వాత 1987–92 వరకు మళ్లీ అతనే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1995 నుంచి 2000 వరకు ఆయన వెంకటేశ్వర రాజు భార్య అంజనమ్మ అవకాశం కల్పించారు. అనంతరం రిజర్వేషన్లు మారడంతో రెండు సార్లు పోటీలో దిగలేదు. 2006–2011, 2014– 2019లో మళ్లీ వెంకటేశ్వరరాజు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఇప్పుటి వరకు ఆ కుటుంబం ఓటమి రుచి చూడలేదు. వెంకటేశ్వర రాజు అనారోగ్యంతో ఇటీవల మరణించారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో వెంకటేశ్వర రాజు కోడలు రెడ్డి చర్ల ఉమాదేవీ బరిలో దిగారు.