కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచదేశాలను ముప్ప తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి అతి తక్కువ సమయంలోనే దేశదేశాలు వ్యాపించి వేల మంది ప్రజలను బలి తీసుకుంటుంది. ఇక దీని బాధితులు లక్షల్లో ఉన్నారంటే.. ప్రస్తుతం పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచదేశాలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇక ఈ రక్కసికి అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నాయి.
అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత సంతతికి చెందిన 98 ఏళ్ల ఓ బామ్మ అద్భుతం సృష్టించింది. కరోనా బారినపడి నాలుగు రోజుల్లోనే కోలుకున్న ఆమె తాజాగా స్కాట్లాండ్‌లోని ఆమె ఇంటికి చేరుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ బామ్మ పేరు డఫ్నే షా. కేరళలోని కొచ్చిలో జన్మించిన ఈమె జులైతో 99వ ఏట అడుగిడబోతోంది. అయితే ఆమెలో నాలుగు రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించాయి. విపరీతమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరగడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను హాస్పటల్‌లో చేర్చారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. అయితే విచిత్రం ఏంటంటే.. కేవలం నాలుగు రోజుల్లోనే ఆమె కోలుకోవడంతో అక్కడ వైద్యులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ఇక దీంతో ఆమెను ఇంటికి పంపించారు. తన బాగోగులను ఇప్పుడు తన కుమారుడు చూసుకుంటున్నాడని డఫ్నే వెల్లడించింది. తానిప్పుడు బాగానే ఉన్నానని, అయితే, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పలేనన్నారు. ఏదేమైనా ఈమె కోలుకోవడంతో ప్రజలందరికీ స్పూర్తిగా నిలిచింది.