టీ కాంగ్రెస్‌లో కలహాలకు చెక్..కీలక నేత ఎంట్రీ.!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. సీనియర్ నేతలు వర్సెస్ టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ వర్గం అన్నట్లు వార్ నడుస్తోంది. మొదట టి‌పి‌సి‌సి పదవుల భర్తీపై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే కొందరు నేతలు తమ పదవులకు రాజీనామాలు కూడా చేశారు. అటు ఉత్తమ్, భట్టి లాంటి వారు రేవంత్‌పై విమర్శలు చేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ పదవులు ఇచ్చారని, తమని సంప్రదించకుండా పదవులని ఇచ్చారని ఫైర్ అయ్యారు.

 

ఓ వర్గం కాంగ్రెస్ పార్టీని సొంతం చేసుకోవాలని చూస్తుందని, ఆ పని జరగనివ్వమని సేవ్ కాంగ్రెస్ పేరిట సీనియర్లు ఏకమైన విషయం తెలిసిందే. అలాగే సెపరేట్ గా సమావేశం అవుతున్నారు. ఇక సీనియర్ల వైఖరిపై రేవంత్ వర్గం కూడా గుర్రుగా ఉంది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 13 మంది నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అలాగే తమ పదవులని సీనియర్లకు కట్టబెట్టాలని మాణిక్కం ఠాగూర్‌కు లేఖ రాశారు. ఎవరు తొందరపడవద్దని సమస్యలు పరిష్కారమవుతాయని మాణిక్కం నేతలకు సర్ది చెప్పడానికి చూశారు.

కానీ ఎవరి పని వారిదే అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చపై అధిష్టానం ఫోకస్ చేసింది. ఇప్పటికే ప్రియాంక గాంధీ రాష్ట్రంలో పరిస్తితులని గమనిస్తున్నారు.  ఇక ఈ కలహాలకు చెక్ పెట్టడానికి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ని రంగంలోకి దింపారు. టీ కాంగ్రెస్‌లో సంక్షోభానికి తెరదించే భాధ్యతను దిగ్విజయ్ సింగ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్‌కు టీ కాంగ్రెస్ అడ్వయిజర్ భాధ్యతను అప్పగించినట్టు సమాచారం. త్వరలో టి.కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశ కానున్నట్టు తెలుస్తోంది. గతంలో దిగ్విజయ్ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయనకు రెండు రాష్ట్రాల నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. మరి దిగ్విజయ్ తెలంగాణలో వివాదాలని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news