గుజరాత్ రాష్ట్రం దాహూద్ జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో సామూహిక భోజనాల విందు మృత్యు ఘంటికలు మోగించింది. విందు ఆరగించిన వారిలో మంగళవారం మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకున్నది.
భుల్వన్ గ్రామంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన పండుగ సోమవారంతో ముగియడంతో సామూహిక విందు ఏర్పాటు చేశారు. స్థానిక మత్తు పానీయాలు, ఆహారం తిన్న వెంటనే నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 11 మంది తీవ్ర అస్వస్థకు గురికావడంత హాస్పిటల్‌లో చేర్చగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందారు.
మరో ఇద్దరు గ్రామీణులు మృతిచెందడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకున్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫుడ్ పాయిజనింగ్ కారణంగా మరణాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. ఆహార నమూనాలను సేకరించామని, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరణాలపై స్పష్ట వస్తుంది అని ఎస్పీ హతేశ్ జాయ్‌సర్ తెలిపారు.