గుడ్డిగా గూగుల్ మ్యాప్స్‌ని ఫాలో అయితే ఒక్కోసారి బాగా టైమ్ వేస్ట్ అవుతుంది. పక్కనే ఉన్నదాన్ని కూడా తిప్పితిప్పి తీసుకెళ్లాలే చేస్తుంది. మనకు ఆ రోడ్డు మీద ఎంతో కొంత అవగాహన ఉంటే.. అప్పుడు ఈ మ్యాప్స్ సాయంతో వెళ్లొచ్చు. కొన్నిసార్లు బానే తీసుకెళ్తాయి. కానీ కొన్నిసార్లు మాత్రం డెడ్ ఎండ్ దగ్గరకు వచ్చాక కూడా స్ట్రైట్‌గా వెళ్లమంటాయి. ఇవన్నీ ఏవో చిన్నపాటి విషయాలు.. కానీ కేవలం గూగుల్ మ్యాప్స్ కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలకు కోల్పోయాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివారాలు ఇలా ఉన్నాయి.
గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్లిన ఓ వ్యక్తి కూలిపోయిన బ్రిడ్జిపై నుండి పడి మృతి చెందగా.. అతడి కుటుంబం గూగుల్ సంస్థ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ సంస్థపై లీగల్ సూట్ దాఖలు చేస్తూ కోర్టుకెక్కింది. నార్త్ కరోలినాలోని హికోరిలో ఉన్న బ్రిడ్జి 2013లో కూలిపోగా.. గతేడాది సెప్టెంబర్‌లో ఫిలిప్ పాక్సన్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్స్ అనుసరించి వెళ్తుండగా అతడి కారు ఉన్నట్టుండి బ్రిడ్జిపై నుండి నీళ్లలో పడిపోయింది. కారు నీట మునగడంతో ఫిలిప్స్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు.
ఇదే ఘటనపై ఫిలిప్స్ పాక్సన్ కుటుంబం తాజాగా అమెరికాలోని స్థానిక కోర్టులో గూగుల్‌పై ఫిర్యాదు చేసింది. గూగుల్ మ్యాప్స్ తప్పిదం వల్లే తన భర్త చనిపోయాడని ఫిలిప్స్ పాక్సన్ భార్య అలిషియా తన ఫిర్యాదులో పేర్కొంది. కూతురు 9వ పుట్టిన రోజు సందర్భంగా పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా తనకు అంతగా తెలియని మార్గంలో ప్రయాణించే క్రమంలో గూగుల్ మ్యాప్స్ తప్పిదం వల్లే తన భర్త ప్రమాదానికి గురై చనిపోయాడని ఫిలిప్స్ భార్య గూగుల్ పై ఆరోపించింది.
ఫిలిప్స్ మృతదేహాన్ని స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టి నీట మునిగిన వాహనాన్ని, అందులోంచి ఫిలిప్స్ శవాన్ని వెలికి తీసినట్టు అతడి భార్య అలిషియా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. కూలిపోయిన బ్రిడ్జిపై ప్రమాద సూచికలు తెలియజేసే హెచ్చరికలు కానీ లేదా బారియర్స్ కానీ ఏవీ లేకపోవడాన్ని అలిషియా తన ఫిర్యాదులో పేర్కొంది.
ఫిలిప్స్ పాక్సన్ భార్య అలిషియా దాఖలు చేసిన లీగల్ సూట్‌పై గూగుల్ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. పాక్సన్ కుటుంబానికి జరిగిన ఘటన తమను కలిచి వేసిందని అన్నారు. జనానికి సరైన రోడ్డు మార్గాలు చూపించేందుకే గూగుల్ మ్యాప్స్ సహాయపడుతోంది అని అన్నారు. అందుకోసం గూగుల్ ఎంతో కృషి చేస్తోంది అని గూగుల్ సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు. గూగుల్ లాంటి పెద్ద సంస్థపై న్యాయపోరాటం కావడంతో ఇప్పుడు అలిషియా తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన అంశంగా తయారైంది. చూడాలి ఈ కేసులో తీర్పు ఎలా వస్తుందో.!