వైఎస్‌ వివేకా హత్య కేసు… సీబీఐ డైరెక్టర్‌కు ఏబీ లేఖ

-

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ హత్య జరిగి దాదాపు రెండేళ్ళు అవుతున్నా నిందితులు ఎవరనేది ఇంకా తేలలేదు. అయితే ఈ కేసు విచారణను సీబీఐ వద్దకు చేరింది. అయితే సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో… దోషులను పట్టువాలని ఇటీవల వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు.


ఇది ఇలా ఉండగా వైఎస్‌ వివేకా హత్యకు సంబంధించి ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడాది అవుతున్నా ఈ కేసులకో ఎలాంటి పురోగతి లేదని ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు సీబీఐ డైరెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి తన వద్ద వివరాలు ఉన్నాయన్న ఆయన… కేసు దర్యాప్తు అధికారి ఎన్‌కే సింగ్‌కు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోలేదని వివరించారు.

వివేకా హత్య జరిగిన చాలా సేపటి వరకు ఎవరినీ లోపలికి అనుమతించలేదని, కొందరు ప్రజాప్రతినిధులు పోలీసులను కావాలనే అడ్డుకున్నారని అని లేఖలో వ్యాఖ్యానించారు. మీడియా, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది, పోలీసులను కూడా అనుమతించలేదని తెలిపారు. హత్య జరిగిన తర్వాత ఇల్లు మొత్తం కడిగి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే వరకు ఘటనా స్థలాన్ని ఎంపీ అవినాష్‌రెడ్డి తన అదుపులో ఉంచుకున్నారని అన్నారు. మొత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు బృందానికి ఇంటెలిజెన్స్‌ విభాగం అందించిందని పేర్కొన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్నందునే తనను ఉద్దేశపూర్వకంగా విధుల నుంచి తప్పించి ఉంటారని వెంకటేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news