మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. సిద్ది జిల్లాలోని రేవా-సత్నా సరిహద్దుల్లోని మోహనియా ప్రాంతంలో శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఒడిశాలోనూ ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని అక్కడికక్కడే ఆరుగురు మరణించారు. జాజ్‌పూర్ జిల్లా ధర్మశాల పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా బంగాల్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.