ఊహించని రీతిలో ఈఎస్ ఐ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఇది స్కాం ఎలా అయ్యింది.. ఇందులో అచ్చెన్నాయుడి పాత్ర ఎంత.. ఏయే రకాలుగా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము నాయకులు పాలయ్యింది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం.. అక్కడ ఏం కొనాలన్నా టెండరింగ్ పద్ధతిలోనే జరగాలి. అలా అయితే తాము అనుకున్నవారికి ఇవ్వలేమనో ఏమో కానీ… ఏపీలో మాత్రం ఈ టెండరింగ్ పద్దతి కాదని, నామినేషన్ పద్ధతిలో భారీగా కొనుగోళ్లు జరిగాయి.
నిబంధనలను కాదని అచ్చెన్నాయుడు ఎంచుకున్న ఈ పద్దతి ప్రకారం… నామినేషన్ పద్దతిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కొన్ని డమ్మీ కంపెనీలను సృష్టించారు. మందులు కొనకపోయినా కొన్నట్టుగా చూపించారు, అవసరం లేకపోయినా మార్కెట్ రేటు కన్నా చాలా ఎక్కువ ధరను చెల్లించి ఆపరేషన్ పరికరాలను కొన్నారు. ఆపై టెలీ మెడిసిన్ అంటూ లెక్కలేవీ లేకుండా కాల్ కి ఇంత అని ఒక ఏజెన్సీకి కోట్ల రూపాయల డబ్బును చెల్లించారు.
టెండర్ల అవసరం లేకుండా.. తాను చెప్పిన కంపెనీలకే మందుల సరఫరా కాంట్రాక్టులు ఇవ్వాలని నాటి మంత్రిగా అచ్చెన్నాయుడు లేఖలు రాసినట్టుగా తెలుస్తోంది. నకిలీ కంపెనీలకు కోట్ల రూపాయల చెల్లింపులు చేయడం… అది కూడా మందులు కొనకుండానే కొన్నట్లుగా బిల్లులు సృష్టించి వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేయగా.. మరో ఐదు మంది ఉద్యోగుల నుంచి ఇప్పటికే స్టేట్ మెంట్లను తీసుకున్నారట ఏసీబీ అధికారులు. ఆ ముగ్గురు ఉద్యోగులు ఇచ్చిన సమాచారం మేరకు స్కామ్ వివరాలన్నీ బయటకు వచ్చాయని.. అచ్చెన్న తెలివి తేటలు బయటపడ్డాయని అంటున్నారు!! ప్రజల సొమ్ము అంటే ఎంత బాధ్యతా రాహిత్యమో కదా!
ఇందులో భాగంగా.. రూ.975 కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోలు ఆసాంతం బోగస్ గానే సాగిందని సమాచారం. ప్రభుత్వం మందుల కొనుగోలుకు 293 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించినా, ఆ మొత్తం చాలదని దాదాపు మరో 700 కోట్ల రూపాయల మొత్తంతో మందులు కొన్నారట. ఇదే క్రమంలో 16 వేల రూపాయల స్థాయి బయోమెట్రిక్ మిషన్ కొనుగోలుకు 70 వేల రూపాయల మొత్తాలను వెచ్చించి అడ్డగోలుగా దోచారని చెబుతున్నారు!!