ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పెద్దగా చర్చ జరగలేదు. అసలు ప్లాంట్ ఉంటుందా? ఉండదా? ప్రైవేటీకరణ జరుగుతుందా? అనే దానిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉండటంతో ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఏపీ ప్రజలు భావించారు. అయితే, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది.దీంతో అధికార పార్టీపై వైసీపీ నాయకులు విమర్శలకు దిగారు.
స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ నేతల వైఖరేంటో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.స్టీల్ ప్లాంట్ విషయంలో సలహాలుంటే ఇవ్వాలని రాజకీయం చేయొద్దని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ తమకు కూడా సెంటిమెంట్ అని, కచ్చితంగా కాపాడుకుంటామని గంటా స్పష్టంచే శారు. టీడీపీ నేతలపై బురదజల్లడం వైసీపీ వాళ్లకు అలవాటైపోయిందని ఆయన విమర్శించారు.ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని గంటా ఎద్దేవాచేశారు.