ఆఫ్గనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో పనిచేసిన వారిని కుటుంబ సభ్యుల ఎదుటే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. ఆ దేశం నుంచి ఎవరూ బయటకు పోకుండా కఠిన ఆంక్షలను విధించి ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నరకం అంటే ఏమిటో చూపించారు. ఇక ఇప్పుడు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు.
మహిళలు.. ముఖ్యంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థినిలతోపాటు ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగినిలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాల్సిందేనని హుకుం విధించారు. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో కో ఎడ్యుకేషన్ ఉన్న చోట విద్యార్థులు, విద్యార్థినిలకు మధ్య పరదాలను కట్టి విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆఫ్గన్ మహిళలు కౌంటర్ ఇస్తున్నారు.
అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఉన్న ఆఫ్గన్ మహిళలు రంగు రంగుల దుస్తులను ధరించి ఫొటోలను తీసుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తున్నారు. తాలిబన్లకు ఆఫ్గనిస్థాన్ సంప్రదాయం అంటే ఏమిటో తెలియదని, హిజాబ్ ధరించడం ఆఫ్గనిస్థాన్ కల్చర్ కాదని, అసలైన కల్చర్ అంటే ఇదే.. నని చెబుతూ రంగు రంగుల దుస్తులను ధరించి ఫొటోలను తీసుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. వారి ఫొటోలు, క్యాంపెయిన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.