గత కొద్ది కాలంగా టాలీవుడ్‌లో ఇండస్ట్రీ పెద్ద అనే అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీ పెద్ద అనే దానికి రెండు, మూడు వర్గాలకు చెందిన నటీ నటులు.. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చర్చ మా ఎన్నికల నుంచి తీవ్ర రూపం దాల్చింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచినా.. ఇండస్ట్రీ పెద్ద అనే అంశంపై చర్చ ఆగిపోలేదు. అయితే ఈ క్రమంలో తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని అనుకోవడం లేదని మెగా స్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు.
ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. కానీ సినీ పరిశ్రమలో ఉండే కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా.. ఆదుకుంటానని ప్రకటించారు. అప్పటి నుంచి మరోసారి ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. తాజా గా ఇండస్ట్రీ పెద్ద అంశంపై హీరో శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధించి టాలీవుడ్ కు పెద్ద మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. దాసరి నారాయణ తర్వాత ఇండస్ట్రీకి పెద్ద మెగా స్టార్ చిరంజీవి అనడంలో తప్పు లేదని అన్నారు.
అందుకు కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. కరోనా సమయంలో గానీ, ఇతర విపత్కర సమయాల్లో గాని సాయం చేయడానికి చిరు ముందు వరుసలో ఉంటారని అన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో సినిమా టికెట్ల ధరల సమస్యనే ఆయనే పరిష్కరించారని అన్నారు.