నిమ్మగడ్డ రమేశ్ కుమార్… ఎందుకంత తొందర?

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకుంటున్నానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. ప్రశాసన్‌ నగర్‌లో ఉన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన… గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని.. అన్నిరాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. కోర్టు తీర్పు శుక్రవారం ఉదయం 11.30 సమయంలో వస్తే.. తాను ఎస్ఈసీగా పునర్నియమితుడైనట్టు అదేరోజు మధ్యాహ్నం 3.30కి అధికారులందరికీ రమేశ్ కుమార్ సర్క్యులర్ పంపించారు. ఎస్ఈసీ వాహనాలను హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయానికి పంపాలని ఎన్నికల సంఘం కార్యదర్శిని ఆదేశించారు. ఎస్ఈసీ న్యాయవాదిగా ఉన్న ప్రభాకర్ ను ఆదివారంలోగా రాజీనామా చేయాలని ఫోన్ లో ఆదేశించారు. సోమవారం తాను కొత్త స్టాండింగ్ కౌన్సెల్ ను నియమించుకుంటానని చెప్పారు. ఇది పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడిన తొందరపాటు చర్య అన్నట్లుగా చెబుతున్నారు ఏజీ శ్రీరాం!

అసలు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు అలాంటి ఆదేశాలివ్వడం కుదరదు అని శ్రీరాం చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను తాను పునర్నియమించుకునే అధికారం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కి లేదని.. అలా స్వయంగా ప్రకటించుకోవడం కూడా చట్టవిరుద్ధమని క్లారిటీ ఇచ్చిన శ్రీరాం… మరింత క్లారిటీ ఇచ్చే విధంగా మాట్లాడారు! ఆయనను ఆ పోస్టులో మళ్లీ నియమించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప, ఆయనే స్వయంగా వెళ్లి ఆ పోస్టులో కూర్చునే వెసులుబాటు ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు! హైకోర్టు తీర్పు ప్రకారం చూస్తే.. అసలు ఎస్ఈసీగా రమేశ్ కుమార్ నియామకమే చట్టవిరుద్ధమని అభిప్రాయపడిన ఆయన… ఆయనను మళ్లీ అదే పోస్టులో నియమించి ప్రభుత్వం మరో తప్పు చేయాలా? అని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో తొందరపడుతున్న నిమ్మగడ్డకు కౌంటర్ గానో లేక ఈ అంశంపై ప్రజలకు మరింత స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనో కానీ… ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపిన శ్రీరాం… ఎస్ఈసీ పోస్టులో తనను తాను నియమించుకుంటూ, ప్రభుత్వ అధికారులకు రమేశ్ కుమార్ జారీచేసిన ఆదేశాలు చెల్లుబాటు కావని, వాటిని పాటించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో… హైకోర్టు ఆదేశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఉంటుందని తెలిపిన ఆయన… ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతున్నందున.. తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్ వేశామని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news