అగ్ని-5 సక్సెస్… చైనా గుండెల్లో గుబులు

భారత దేశం తన అత్యంత వ్యూహాత్మకమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని మరోమారు విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. అత్యంత ఖచ్చితత్వంతో 5000 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించింది. దీంతో భారత దేశ రక్షణ మరింత బలపడిందని రక్షణశాఖ అభివర్ణించింది. 2012లో మొదటి సారిగా అగ్ని-5 ని పరీక్షించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. అగ్ని-5ని డీఆర్డీఓ అభివ్రుద్ధి చేసింది. 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 దాదాపు 1.5 టన్నలు అణు వార్ హెడ్ ను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.

 చైనా, ఇండియా సరిహద్దుల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్న క్రమంలో అగ్ని-5 విజయం భారత రక్షణ దళాల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తోంది. చైనాలోని డాంగ్ పెంగ్ 41 క్షిపణికి వ్యతిరేఖంగా అగ్ని-5 భారత క్షిపణి సామర్థ్యాన్ని పెంచుతుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాంగ్ పెంగ్ 41 క్షిపణి 12 వేల నుంచి 14 వేల కిలోమీటర్ల లక్ష్యాలను చేధిస్తుంది. ప్రస్తుతం అగ్ని-5 క్షిపణి పరిధిలోకి దాదాపుగా చైనా భూభాగం మొత్తం వస్తుంది. బీజింగ్, షాంఘై వంటి నగరాలు అగ్ని-5 రేంజ్ లో ఉన్నాయి. తాజాగా అగ్ని-5 విజయవంతం అవడంతో చైనా గుండెల్లో గుబులు రేగుతోంది. గతంలో కూడా అగ్ని-5 విజయవంతం కావడంతో చైనా తన అక్కసును వెల్లగక్కింది. ప్రాంతీయంగా ఉద్రిక్తలను రేపుతోందని ఆరోపించింది. ప్రస్తుతం భారత్ లో అగ్ని సిరీస్ లో1 నుంచి 4 క్షిపణులు కూడా ఉన్నాయి. వీటి పరిధి 700 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల వరకు ఉంది.