కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్‌కు చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ యాత్ర కొనసాగుతోంది. కశ్మీర్‌లో ఈ యాత్ర ముగియనుంది.
ఈ క్రమంలో రాహుల్‌గాంధీ పాదయాత్రపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ యాత్ర ఎందుకు చేస్తున్నట్టో అని ఎద్దేవా చేస్తున్నారు. పాదయాత్రలతో ఓట్లు రాలవని ఎగతాళిగా చేస్తున్నారు. బీజేపీ నాయకుల సెటైర్లపై రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో స్పందించారు. అల్వార్‌లో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ నాయకుల సెటైర్లకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఒక మార్కెట్‌గా, తన పాదయాత్రను ఆ విద్వేష మార్కెట్‌లో ప్రేమను నింపే ఒక దుకాణంగా పోల్చి సమాధానమిచ్చారు. తాను విద్వేష మార్కెట్‌లో ప్రేమను పంచే ఒక దుకాణం తెరిచానని వ్యాఖ్యానించారు.