తమిళనాట విచిత్రం..అధికారంలోకి రావడం అన్నాడీఎంకే కేడర్ కే ఇష్టం లేదా ?

-

ఏ పార్టీ క్యాడర్‌ అయినాఎన్నికల్లో గెలవడానికి పని చేస్తారు. తమ పార్టీ అధికారంలోకి రావాలని కలలు కంటారు. కాని తమిళనాడులో పరిస్థితి అలా లేదు. అన్నాడీఎంకే కేడర్‌ మాత్రం ఈ ఎన్నికల్లో ఓడిపోతేనే తమ పార్టీ బతికి బట్ట కడుతుందనుకుంటున్నారు. తమిళనాట ఎందుకి విచిత్ర పరిస్థితి అసలు అన్నాడీఎంకే కేడర్ మనసులో ఏముంది.

దక్షిణ భారత దేశంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ఉత్తరాది పార్టీ బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కర్ణాటకలో మాత్రమే ఆడపాదడపా విజయాలు సాధిస్తోంది. బీజేపీకి తెలంగాణలో ఇద్దరు, కేరళలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. అరవనాట ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కాషాయ పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం లేదు. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. దీన్ని క్యాష్‌ చేసుకుని బలపడాలని వ్యూహాలు రచిస్తోంది.

ద్రవిడ రాజకీయాలు ఉత్తరాది పార్టీలకు ముందు నుంచి వ్యతిరేకం. వారి ఆధిపత్యం, పెత్తనాన్ని ఏ మాత్రం సహించరు. పెరియార్‌ రామస్వామి ఆలోచనలకు అనుగుణంగా తమిళ పాలిటిక్స్‌ ఉంటాయ్. హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా…ఉమ్మడిగా పోరాటం చేస్తారు. జల్లికట్టు క్రీడ కోసం జాతీయస్థాయిలో ఉద్యమం చేసిన చరిత్ర తమిళులది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నాడీఎంకే కూటమి గెలిచినా పెత్తనం మాత్రం బీజేపీ చెలాయిస్తుందని మదనపడుతున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు.

ఓ పద్దతి ప్రకారం అన్నాడీఎంకేను బలహీన పరచి….క్రమంగా తాము బలపడేలా కమలం నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తేఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోక తప్పదని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నాడీఎంకే ప్రతిపక్షానికే పరిమితమవుతుంది. బీజేపీ కూడా తమిళనాడుపై ఆశలు వదిలేసుకునే అవకాశాలు ఉన్నాయ్. హిందీ బెల్ట్ రాష్ట్రాలపైనే ఫోకస్‌ చేస్తుంది.

ఇక ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న జయ నెచ్చెలి శశికళ వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకేలోకి చేరికకు మార్గం సుగమవుతుంది. తద్వారా ఒకే దెబ్బకు మూడు పిట్టలన్నట్లు..బీజేపీని ఎదగకుండా చేయడం..అన్నాడీఎంకే బలపడటం..చిన్నమ్మ రీ ఎంట్రీకి ఎదురులేకుండా పోతుంది. అందుకే అన్నాడీఎంకే ఓడిపోవాలంటు పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news