ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా జూన్ 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు గాను బుకింగ్స్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు శనివారం ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం విదితమే. అయితే మే 4వ తేదీ నుంచి దేశంలోని పలు మార్గాల్లో డొమెస్టిక్ విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది.
ఇక కరోనా లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా మే 3వ తేదీ వరకు విమాన సర్వీసులకు బుకింగ్స్‌ను నిలిపివేశారు. అయితే జూన్ 1 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్స్‌ను ప్రారంభిస్తామని ఎయిరిండియా తెలిపిన నేపథ్యంలో మిగిలిన విమానయాన సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్ కారణంగా కొన్ని వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన విమానయాన రంగం మళ్లీ పునరుజ్జీవం చెందాలంటే.. తిరిగి ఆ సర్వీసులు యథావిధిగా ప్రారంభమవ్వాలి. అయితే ఆ సేవలు ప్రారంభమైనా ప్రయాణికులు విమానాల్లో వెళ్లేందుకు ఏ మేర ధైర్యం చేస్తారో చూడాలి.
కాగా భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 14వేలు దాటగా.. 488 మంది మృతి చెందారు. మరో 2045 మంది రికవరీ అయ్యారు.