ఎయిర్ క్రాప్ట్ సెక్యూరిటీ నిబంధనలు సవరిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్ది రోజుల నుంచి కొన్ని విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్టోబర్ 14వ తేదీ నుంచి ఈ కాల్స్ అధికమయ్యాయి. దాదాపు 100కు పైగా బెదిరింపులు రాగా.. తాజాగా ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ ఎయిర్ ఇండియా ప్రయాణికులను హెచ్చరించాడు.
నవంబర్ 1 నుంచి 19 వరకూ ఆ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించవద్దని ప్రకటించాడు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ సెక్యూరిటీ నిబంధనల్ని సవరిస్తామని తెలిపారు. అలాగే బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని ఇకపై విమానంలో ప్రయాణించకుండా నో ఫ్లై లిస్ట్ లో చేర్చుతామని ప్రకటించారు. బెదిరింపులకు పాల్పడటం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామన్నారు. ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని తెలిపారు. శిక్ష, జరిమానాలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయని స్పష్టం చేశారు.