తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా త్వరలోనే జిల్లాకు మరో వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన వేణు బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేర్చుతుందని హామీ ఇచ్చారు. గ్రూప్ 1
అభ్యర్థులను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టాయని తెలిపారు. ఉమ్మడి
నిజామాబాద్ జిల్లా ప్రజలకు, విద్యార్థులకు ఓ మంచి విషయం ప్రకటిస్తున్నాను అని తెలిపిన పీసీసీ
చీఫ్.. త్వరలోనే మరొక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడంతోపాటు, జిల్లా నుండి ఎంతో మంది డాక్టర్లుగా ఎదిగి, జిల్లాకు మంచి పేరు తెస్తారని
పేర్కొన్నారు.