ఇరాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 180 మంది వరకు మరణించినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం తెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమీని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. అసలు కారణం ఏంటీ అనేది తెలియకపోయినా, గాల్లోనే పేలిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావు ఇస్తోంది.
ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం అందగా ఎంత మంది మరణించారు అనేది ఇంకా లెక్క తేలలేదు. కూలిపోయిన నిమిషాల్లోనే ఇరానియన్ అత్యవసరసేవల సిబ్బంది అక్కడకు చేరుకున్నా, భారీఎత్తున ఎగసిపడుతున్న మంటల కారణంగా ఎవరనీ రక్షించలేకపోయారు.
ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఏదైనా క్షిపణి ప్రయోగం జరిగి విమానం కూలిపోయిందా, లేక సాంకేతిక సమస్యలతోనే కూలిపోయిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇరాన్, ఇరాక్ లోని అమెరికా బేస్ క్యాంప్ లపై క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. అవి జరిగిన రోజు వ్యవధిలోనే ఈ ప్రమాదం జరగడంపై అంతర్జాతీయంగా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విమానం ఎవరు ఉన్నారు…? ఇరాన్ అధికారులు ఎవరైనా ఉన్నారా…? అనే దాని మీద వివరాలు తెలియాల్సిఉంది.