చిరు సినిమాను రిజెక్ట్ చేసిన అజయ్… కారణమిదే!

-

రంగస్థల నటుడిగా తన జీవితాన్ని ప్రారంభించి వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు అజయ్‌ ఘోష్‌. ప్రస్థానం సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పూరీ జగన్నాథ్‌ ‘జ్యోతిలక్ష్మి’ సినిమాలో విలన్‌గానూ రాణించారు. రంగస్థలం, పుష్ప సినిమాల్లో నటించి తన కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకున్నారు. తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.

అజయ్ ఘోష్‌ అంటే విలన్‌ పాత్రలకు మాత్రమే పరిమితం అని కాకుండా కామెడీ పాత్రల్లోనూ నటిస్తూ ఆయన నటనా ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఆయన చెప్పాలని ఉంది కార్యక్రమంలో పాల్గొని కొన్ని ఆసక్తికర సంగతులు తెలియజేశారు. ఆచార్య సినిమా ఛాన్స్​ ఎందుకు మిస్​ చేసుకున్నారు, తన కెరీర్​ను మలుపు తిప్పిన సినిమా ఏంటి? విషయాలను చెప్పారు.

“పూరీజగన్నాథ్‌ జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత అందరూ నన్ను పొగిడారు. ఇంకేముంది నేను నిలదొక్కుకున్నా అనుకున్నా. కానీ సంవత్సరం దాటినా ఎవరూ పిలవలేదు. అప్పుడు మామూలు పనులకు వెళ్లిపోయేవాడిని. నాకు తెలిసిన ఓ వ్యక్తి నాతో మాట్లాడుతూ.. ‘అవకాశాలు రావట్లేదని బాధపడకు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే దర్శకులు నీకు కచ్చితంగా పాత్రలు ఇస్తారు’ అని చెప్పాడు. ఆయన చెప్పింది నిజం ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఎక్కువశాతం కొత్త దర్శకులవే. కొరటాల శివ గారు ఆచార్య సినిమాలో విలన్‌ పాత్ర కోసం పిలిచారు. కానీ నాకు ఆ సమయంలో కొన్ని ఆరోగ్యసమస్యలు ఉండడం వల్ల చేయలేకపోయాను” అని చెప్పారు.

సుకుమార్‌ నా జీవితాన్ని మలుపు తిప్పారు. రంగస్థలం తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుకుమార్‌ను నేను స్నేహితుడు, గురువు, దర్శకుడు అని అనను. నా దృష్టిలో ఆయన అంతకన్నా గొప్ప. పుష్ప సినిమా సమయంలో నాకు కరోనా వచ్చింది. బాగా డీలా పడిపోయా. టీవీ చూడాలంటే భయంవేసింది. మానసికంగా చాలా కుంగిపోయా. తెల్లవారితే చనిపోతా అని ప్రతిరోజు అనుకునేవాడిని. ఆ సమయంలో పుష్ప అవకాశం వచ్చింది. కరోనా భయం వల్ల చేయను అని చెప్పా. ఆ సమయంలో సుకుమార్‌ నాలో భయాన్ని పొగోట్టడానికి ఎంత చేశారో. 200మంది ముందు నా కోసం నాలో మనోధైర్యాన్ని నింపడం కోసం డాన్స్‌ కూడా చేశారు. పుష్ప తర్వాత ఫోన్‌ చేస్తే ‘ఇకపై నేను తీసే ప్రతి సినిమాలో నువ్వు ఉంటావు’ అన్నారు. అంతకన్నా ఏమికావాలి నాకు సుకుమార్‌కు నిజంగా రుణపడి ఉంటాను.

Read more RELATED
Recommended to you

Latest news