ఏపిలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది. మద్యం అమ్మకాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించింది. స్వదేశీ, విదేశీ మద్యం సీసాలపై కనిష్టంగా పది రూపాయల నుంచి గరిష్టంగా రూ.250 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన మద్యం ధరలు అక్టోబర్ 1(మంగళవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే ఈరోజు నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే కొనసాగనున్నాయి. ఇక రెడీ టు డ్రింక్ పేరుతో విక్రయించే 250/275 ఎంఎల్ మద్యం సీసాలపై రూ.20 పెంచింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..స్వదేశీ, విదేశీ మద్యం క్వార్టర్ సీసాపై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెరిగింది. స్వదేశీ మద్యం 60/90 ఎంఎల్ బాటిళ్లపై రూ.10, లీటరు మద్యం సీసాపై రూ.100, రెండు లీటర్ల బాటిల్‌పై రూ.250 పెంచారు. విదేశీ మద్యం 50/60 ఎంఎల్ సీసాలపై రూ.10, లీటరున్నరరెండు లీటర్లు కలిగిన మద్యం బాటిళ్లపై రూ.250 పెరిగింది. ఇక, 330/500 ఎంఎల్ బీర్ సీసాలపై రూ.10, 650 ఎంఎల్ బీరు సీసాలపై రూ.20 పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.