అఖిలపక్షంతో నేడు ఈసీ భేటీ

-

త్వరలో రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సరళి, ఓటింగ్ విధానం, ఓటర్ల జాబితా.. ఇతర అంశాల గురించి చర్చించేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి ఏడు జాతీయ, 51 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల కమిషన్ ఆహ్వానించింది. రాజకీయ పార్టీలకు చర్చకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ.. ప్రాక్సీ ఓటింగ్ (ఒకరి తరుపున మరొకరు ఓటు వేయడం) అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. ‘ ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలసవెళ్లే వారు వివిధ కారణాలతో ఓటింగ్ కు దూరమయ్యే వారు సైతం ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ చర్యలు’ అనే అంశాన్ని ఈసీ అజెండాలో పేర్కొంది.

వీటితో పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందు ప్రచారం ముగుస్తున్నప్పటికీ… సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న విధానానికి అడ్డుకట్ట వేస్తూ తీసుకోవాల్సిన చర్యలపై.. రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని ఈసీ పేర్కొంది. రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే… అయితే పార్టీల ఖర్చుకు పరిమితి విధించాల్సిన ప్రతిపాదనను సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రకటనలకు, అభ్యర్థి చేసే ఖర్చుని సైతం పార్టీ ఖర్చులోనే జమచేసే విధంగా ఉండాలని ఈసీ భావిస్తోంది. మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలతో పాటు వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news