తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా.!

-

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత చాలా అధికంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది మరణించారు. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య చూసి ప్రజలు వణికిపోతున్నారు. రాజకీయ నాయకులకు, అధికారులకు సైతం కరోనా సెగ తగులుతుంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం. కాగా.. తాజాగా.. అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

అయితే జూలై నెలలో పలు కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇదివరకే షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం‌తో పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు రావడంతో… ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు… హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే ఎంట్రెన్స్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈక్రమంలో తెలంగాణలో ఎంసెట్ పరీక్షలతో సహా అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టుకు ఏజీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news