ఉల్లిగడ్డను మించిన ఆలుగడ్డ…!

-

ఉల్లిగడ్డ సరసన ఆలుగడ్డ వచ్చి చేరింది. ఉల్లిగడ్డ కంటే తానేం తక్కువ అనుకుందేమో ఆలుగడ్డ..అది కూడా కొండెక్కి కూర్చుంది. ఉల్లిని మించింది ఆలూ ధర. నిన్నమొన్నటిదాకా కిలో 25 కూడా పలకని ఆలూ.. ఇప్పుడు 50 రూపాయలకు పైమాటే. ఇది కూడా రైతుబజార్‌ ధర. సాధారణ మార్కెట్లో కిలో 80కిపైనే. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సప్లై లేకుండా పోయింది. దళారుల చేతివాటంతో.. స్టాక్‌ కోల్డ్‌ స్టోరేజ్‌లకే పరిమితమైంది.

ఆలుగడ్డను ఉత్తరాదిలోనే దాచేస్తుండటంతో… కొరత ఏర్పడింది అంటున్నారు వ్యాపారులు. అక్కడి వ్యాపారులు ఆలుగడ్డను అక్రమంగా కోల్డ్‌స్టోరేజీలకు చేరవేమస్తుండటమే కాకుండా.. ధర పెరిగిన తర్వాత మార్కెట్‌కు రిలీజ్‌ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారంటున్నారు. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

ఆలుగడ్డ అత్యధికంగా ఉత్పత్తి అయ్యేది ఉత్తరాది రాష్ర్టాల్లోనే. ఢిల్లీలోని ఆగ్రా, మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ర్టాల్లో అత్యధికంగా ఆలు ఉత్పత్తవుతుంది. ఇక తెలంగాణలోని జహీరాబాద్‌ ఆలుగడ్డకు పెట్టింది పేరు. ఈసారి ఉత్తరాది రాష్ర్టాల్లో ఆలుగడ్డ ఉత్పత్తి భారీగా పెరిగింది. కానీ.. భారీ వర్షాలకు జహీరాబాద్‌ ఆలుగడ్డ నీటిపాలైంది. ఇప్పటికే ఏ కూరగాయ కొనాలన్నా కిలోకు 100 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. ఆకుకూరల ధరలు సైతం భగ్గుమంటున్నాయి. ఉల్లి.. కోయకుండానే కంటతడి పెట్టిస్తోంది. ఇప్పుడు ఆదే దారిలోకి ఆలు వచ్చి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news