కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలంటే.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ ఆటలో అరటిపండు అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం అనేది పలువురి అభిప్రాయం. అసలే చీకటి దారంతా గతుకులు అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్… అనంతర కాలంలో అధికారపక్షానికి వంతపాడారు.. దాన్నే రాజకీయ ఆత్మహత్యా ప్రయత్నం అని అప్పట్లో కామెంట్లు పడ్డాయి! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా అమరావతి విషయంలో రైతులు, మహిళలు పవన్ కి ఒక సూచన చేస్తున్నారు.
అవును… ప్రస్తుతం పవన్ ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా అమరావతి రైతులు, మహిళలు నమ్ముతున్నారంట. ఈ మేరకు ఇంతకాలం జగన్ పై విమర్శలు, బాబుకు రిక్వస్టులు పెట్టుకున్న రాజధాని ప్రాంత రైతులు.. ఇప్పుడు పవన్ కు రిక్వస్టులు పెడుతున్నారు. తాము పవన్ ని నమ్ముతున్నామని, పవన్ శక్తి సామర్ధ్యాలను నమ్ముతున్నామని చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగా… పవన్ ఇచ్చిన మాట నిలుపుకొంటూ లాంగ్ మార్చ్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కదలిక వస్తుందని రాజధాని రైతులు అభిప్రాయపడుతున్నారు.
అసలు పవన్.. బీజేపీతో జతకట్టడానికి ముందు చెప్పిన కారణాన్ని రైతులు, మహిళలు గుర్తుచేస్తున్నారు. నాడు అండగా ఉంటానని చెప్పి.. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేయడం కోసమే బీజేపీతో కలిశానన్న పవన్ కల్యాణ్.. నేడు ఆ పనులు తప్ప అన్నీ చేస్తున్నారని మండిపడుతున్నారు. తన రాజకీయ స్వలాభాల కోసం బీజేపీతో జతకట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని.. కానీ… “తమకు న్యాయం చేయడం కోసమే బీజేపీతో” అని చెప్పిన పవన్ నేడు ముఖం చాటేయడం సమంజసం కాదని చెబుతున్నారు.
మరి పవన్ వరకూ అమరావతి ప్రాంత రాజధాని రైతులు, మహిళల మాటలు వినిపిస్తాయా? వారు కోరుకుంటున్నట్లు లాంగ్ మార్చ్ ప్లానింగ్స్ పవన్ కు ఉన్నాయా? ఆ మాటలు నాడు.. నేడు కాదని చెప్పబోతున్నారా? అనేది వేచి చూడాలి!!
-CH Raja