అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాజధానిగా అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. బుధవారం రోజు అమరావతి రైతుల పాదయాత్రలో ఉంగటూరు నియోజకవర్గం ఘనపవరం మండలంలో రైతులకు మద్దతుగా పాదయాత్రలో మందపాటి బసవరెడ్డి, మరిడి చిట్టిబాబు, బొట్టు రామచంద్రరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
పాదయాత్రలో ఎక్కడికక్కడ స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. వృద్ధులు, మహిళలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో అమరావతి రైతుల మహాపాదయాత్ర ముందుకు సాగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ప్రతిపాదనను ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీనిపై భగ్గుమన్న రాజధాని ప్రాంత రైతులు అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలంటూ రాజధాని పరిరక్షణ సమితి పేరిట ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారు.