యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ 13వ ఎడిషన్‌కు గాను టైటిల్ స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించబోమని వివో బీసీసీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఈ విషయంపై నిర్ణయం తీసుకోనప్పటికీ వివోయే స్వయంగా తప్పుకుంది. దీంతో బీసీసీఐ అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో హఠాత్తుగా టైటిల్ స్పాన్సర్‌ను కోల్పోవడం వల్ల బీసీసీఐకి సుమారుగా రూ.440 కోట్లు నష్టం వస్తుందని తెలుస్తోంది. అయినప్పటికీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌కు గాను అమెజాన్ సహా పలు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని తెలిసింది. దీంతో బీసీసీఐ ఇప్పుడు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటోంది.
ఐపీఎల్ 13వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ముందుంది. దీంతోపాటు బైజూస్, మై సర్కిల్ 11, అన్ అకాడమీ, డ్రీమ్ 11 తదితర సంస్థలు కూడా ఈ రేసులో నిలిచాయి. అయితే అన్నింటి కన్నా అమెజాన్‌కే ఈ విషయంలో ఎక్కువ చాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే.. ఐపీఎల్ జరగనున్న సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10.. భారత్‌లో పండుగల సీజన్. ఆ సమయంలో సహజంగానే షాపింగ్ ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల అమెజాన్ ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్ అయితే అది వారి సంస్థకు ఎక్కువ లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. అందువల్లే అమెజాన్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రేసులో నిలిచింది.
ఇక ఇతర సంస్థలు కూడా ఈ రేసులో అమెజాన్‌తో పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే వివో తప్పుకోవడం వల్ల కోల్పోయిన రూ.440 కోట్లలో 3వ వంతు.. అంటే రూ.180 కోట్లు వచ్చినా చాలని బీసీసీఐ భావిస్తోంది. కనుక ఈ విషయంలో అమెజాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ ఈ విషయంపై ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది కనుక.. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 13వ ఎడిషన్ టైటిల్ స్పాన్సర్ ఎవరో తెలిసిపోతుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.