ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్తగా ఓ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ డే డెలివరీ Amazon Day Delivery పేరిట వచ్చిన ఈ ఫీచర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ప్రత్యేకంగా పనిచేస్తుంది. దీని సహాయంతో అమెజాన్ కస్టమర్లు వారమంతా అమెజాన్ లో ఏవైనా వస్తువులు ఆర్డర్ చేయవచ్చు. కానీ డెలివరీని మాత్రం ఒకే రోజు తీసుకోవచ్చు.
అమెజాన్ డే డెలివరీ సహాయంతో కస్టమర్లు వారంలో ఒక రోజును డే డెలివరీ కింద పెట్టుకోవచ్చు. ఆ రోజుకు 2 రోజుల ముందు వరకు కస్టమర్లు తమకు కావల్సిన వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. కానీ వాటి డెలివరీ మాత్రం ముందుగా సెట్ చేసుకున్న డే డెలివరీ రోజునే అందుతాయి.
అంటే.. ఉదాహరణకు ఒక కస్టమర్ అమెజాన్‌లో వారంలో సోమవారాన్ని తన డెలివరీ రోజుగా సెట్ చేశాడనుకుందాం. అంతకు రెండు రోజుల ముందుగా అంటే మంగళవారం నుంచి శనివారం వరకు అమెజాన్‌లో వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. కానీ డెలివరీ మాత్రం సోమవారమే జరుగుతుంది. దీంతో అమెజాన్ డెలివరీ ఏజెంట్లు పదే పదే తిరగాల్సిన పని ఉండదు. ఫలితంగా వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు తగ్గుతాయి.
అమెజాన్‌లో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. వస్తువుల ఆర్డర్ సమయంలో వారు డెలివరీ రోజును సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి సెలెక్ట్ చేసుకున్న రోజును మార్చుకునే సదుపాయం కూడా కల్పించారు. 2030 వరకు కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో అమెజాన్ ఈ వినూత్న ఫీచర్‌కు శ్రీకారం చుట్టింది.