ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో త్వరలో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనుంది. మార్చి నెలలో ఈ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుండగా, ఇప్పటికే బెంగళూరులోని పలు ఎంపిక చేసిన రెస్టారెంట్ల ద్వారా అమెజాన్ ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే అతి త్వరలో అమెజాన్ ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి.
కాగా అమెజాన్ అందించనున్న ఫుడ్ డెలివరీ సేవలు ప్రైమ్‌తో బండిల్‌గా లభించనున్నాయి. అంటే అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇక ఈ విషయం స్విగ్గీ, జొమాటో సంస్థలను కలవర పెడుతోంది. ఇటీవలే ఊబర్ కంపెనీ తన ఊబర్ ఈట్స్ యాప్‌ను జొమాటోకు విక్రయించగా, ప్రస్తుతం మార్కెట్‌లో స్విగ్గీ, జొమాటోలే ముఖ్యమైన ఫుడ్ డెలివరీ యాప్‌లుగా కొనసాగుతున్నాయి. అయితే అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ వస్తే ఈ రెండు కంపెనీలకు గడ్డు కాలం వస్తుందనే చెప్పవచ్చు.
కాగా అమెజాన్ ఫుడ్ డెలివరీ సేవలు నిజానికి గతేడాది దీపావళి సమయంలోనే ప్రారంభం కావల్సి ఉంది. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది. అయితే ఎట్టకేలకు మార్చి నెలలో ఆ సేవలు అందుబాటులోకి వస్తాయని అమెజాన్ సంస్థ ప్రతినిధి ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలో అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ అందుబాటులోకి వస్తే.. స్విగ్గీ, జొమాటోలు ఆ పోటీని తట్టుకుని నిలబడతాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!