మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అల వైకుంఠపురంలో’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో నూటపది కోట్లకు పైగా వసూళ్లు మరియు అమెరికాలో మూడు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్తో దుమ్మురేపింది. చిత్రంలోని కంటెంట్ తో పాటు ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేసిన ఈ చిత్ర టీం అందుకు తగ్గ ఫలితాలనే అందుకుంది.
అయితే ఈ చిత్రం విడుదల అయ్యే సమయానికి ఒక పోస్టర్ లో జనవరి 11 నుంచి యూఎస్ ప్రీమియర్ మొదలు అని ఉండగా దాని కిందనే ఈ చిత్రం మీకు అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండదు అన్న క్యాప్షన్ జనాలను చాలా విశేషంగా ఆకర్షించింది. డిజిటల్ విప్లవం మొదలయ్యాక నెట్ ఫ్లిక్స్ ,అమెజాన్ ప్రైమ్ ప్రజలను ఆకర్షించడం లో ముందున్న విషయం తెలిసిందే.
ఒక సినిమా ఏదైనా థియేటర్లలో విడుదల అయితే నెలరోజుల్లోనే ఓటీటీ ప్లాట్ఫాం లో ప్రత్యక్షం అవుతోంది. ఇక విదేశాల్లో ఉండే భారతీయులు అయితే వారి పని బిజీలో సినిమా థియేటర్ కు వెళ్లకుండా హాయిగా ఇంట్లో రాత్రిపూట సినిమా చూసేస్తారు కాబట్టి పోస్టర్ కింద అలా వేయడంతో ప్రజలంతా థియేటర్ వైపు కదిలారు.
కట్ చేస్తే ఈరోజు సన్ నెక్స్ట్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సరే అది ముందునుంచీ తెలిసిన విషయమే కదా అని అనుకుంటే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇప్పుడు స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూసి ఆశ్చర్యపోయి ప్రజలు.. మమ్మల్ని థియేటర్లకు రప్పించడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారా అని విపరీతంగా ఫైర్ అవుతున్నారు.