ఏ ఎన్నికలోనైనా ఓడిపోయినప్పుడు వివిధ కారణాలు సాకు చూపుతూ వీరంగం సృష్టించడం చంద్రబాబుకు మాములేనని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. రేణిగుంట విమానాశ్రమంలో జరిగిన ఘటనపై ఆయన స్పందించి మాట్లాడారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్‌పై వీరంగం సృష్టించారని తాజాగా.. జారిపోయే క్యాడర్‌లో భ్రమలు కలిగించేందుకు విమానాశ్రయంలో వీరంగం సృష్టించి ఎత్తుగడలు వేస్తున్నారని పేర్కొన్నారు. 14 ఏళ్లు పాలించిన ఆయనకు ఎన్నికల కోడ్, కోవిడ్ అమలులో ఉన్నప్పుడు నిరసనలు, ధర్నాలు చేయరాదని తెలియకపోవడం విడ్డూరమన్నారు. ఎన్నికల్లో నిలబెట్టేందుకు అభ్యర్థులు లేని టీడీపీకి సీఎం జగన్ భయపడుతున్నాడని అనడం హాస్యాస్పదం అన్నారు.
ఎల్లో మీడియా వ్యక్తి సలహాతోనే..
ఎన్నికల కోడ్, కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నప్పుడు నిరసన చేయడం తప్పని పోలీసులు ఒక్కరోజు ముందు చంద్రబాబు అనుమతిని నిరాకరించారు. అయినా వినకుండా చంద్రబాబు పోలీసులపైనే తిరగబడ్డారని ఆరోపించారు. ఎల్లో మీడియాకు చెందిన వ్యక్తి సలహా ఇవ్వగానే బాబు కింద కూర్చొని హైడ్రామ చేశారన్నారు. చట్టని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా కానిస్టేబుల్‌కు సైతం అరెస్టు చేసే అధికారం ఉంటుందని అది చంద్రబాబు తెలుసుకోవాల్సి అవసరం ఉందన్నారు. 2017లో కోవిడ్ లేదు ఎన్నికల కోడ్‌లేదు హోదాకోసం విద్యార్థులు వైజాక్‌లో ప్రదర్శన చేస్తుంటే ప్రతిపక్ష నేతగా జగన్ అక్కడికి వెళ్లారు. రన్‌వేపైనే జగన్‌ను ఆపినప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని అంబటి ప్రశ్నించారు.