కరోనా వైరస్ ఉద్ధృతితో ఇబ్బందులు పడుతున్న అమెరికాను హరికేన్ హన్నా వణికిస్తోంది. రెండోసారి తీరం దాటిన ఈ తుఫాను.. టెక్సాస్ తీరప్రాంతంలో పెను గాలులకు కారణమైంది. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అమెరికా ప్రకటించిన వివరాల ప్రకారం..అమెరికా టెక్సాస్‌లో హన్నా తుపాను శనివారం మరోసారి తీరం దాటింది. అట్లాంటిక్ సముద్రంలో ప్రారంభమైన హరికేన్ హన్నా.. వాయువ్య దిశకు 15 మైళ్ల దూరంలో సాయంత్రం 6:15 గంటలకు తూర్పు కెనడీ కౌంటీలో రెండోసారి తీరం దాటింది. ఈ తుపాను ప్రభావంతో అక్కడ ప్రచండగాలులు వీచాయి.
ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో అతలాకుతలమైన అమెరికాలోని టెక్సాస్‌లో.. హరికేన్ తుపానుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గరిష్ఠంగా 90 మైళ్ల (145 కిలోమీటర్లు) వేగంతో గాలులు వీచాయి. నది ఒడ్డున నిలిపిన పడవలు.. అలల తాకిడికి ధ్వంసమయ్యాయి. భారీ వర్షం, తుఫాను కారణంగా టెక్సాస్‌లోని తీరప్రాంతం దెబ్బతింది.ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించిన స్థానిక అధికారులు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.